‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమంటోంది!
టీడీపీలో పొసగని నేతలు
కర్నూలు: టీడీపీలో మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో పాటు ఆ పార్టీ నేతలనే పరోక్షంగా బెదిరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చేతులు కలిపినట్లు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. కోడుమూరులో ఇటీవల మంత్రి అచ్చెన్నాయడు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, విష్ణు మధ్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదిన వేడుకల సందర్భంగా వెలిసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీని వెనుక మంత్రి టీజీ హస్తం ఉన్నట్లు శ్యాంబాబు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్‌బాబుపై జరిగిన దాడి పట్ల కూడా విష్ణు తీవ్రంగా స్పందించారు. దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుదున్న సునీల్‌బాబును స్వయంగా వెళ్లి పరామర్శించారు. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస పరిణామాలతో మంత్రి వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విష్ణు, కేఈలు కలిసి పార్టీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు వారి అనుచరుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలులో మంత్రి అనుచరుల గుండాయిజంపై చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంత్రి అనుచరుల
గుండాయిజంపై విష్ణు ఫైర్
‘‘తాజా పరిణామాలు పూర్తిగా నాకు తెలుసు, వాటి పర్యవసానం త్వరలో మీరే చూస్తారు. సునీల్‌బాబు.. విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అతను టీడీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాయకుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు దాడి చేశారు. మనపై జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా మనం కూడా అదే స్థాయిలో స్పందించాలి. ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదు’’ అంటూ విష్ణువర్దన్‌రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో ముఖ్య అనుచరులు, కర్నూలు మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను తాపత్రయపడుతున్నానని, ఇటీవల ఆల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్‌పైప్ లీకేజీ విషయంలో కూడా అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేశాను. అయితే చివరి నిమిషంలో అధిష్టానం సూచన మేరకు విరమించుకున్నట్లు చెప్పారు.
వివాదాస్పదమవుతున్న
మంత్రి టీజీ భరత్ తీరు
జట్టుకడుతున్న రెండు ప్రధాన
కుటుంబాలు
ఆజ్యం పోసిన సోషల్ మీడియా
కార్యకర్తపై దాడి
ముఖ్య నేతలు, అనుచరులతో
సమావేశమైన విష్ణు
అదేస్థాయిలో స్పందిద్దామని భరోసా


