సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(అర్బన్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని 91 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే అనేక మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొనలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులపై 24 గంటల్లోగా సచివాలయ ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు.
సమస్యలను సత్వరం పరిష్కరించాలి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరిస్తే వినియోగదారుల్లో సంతృప్తి రేటు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జంట హత్యల కేసులో
మరో 13 మంది అరెస్టు
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన అన్నదమ్ముల హత్య కేసులో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మర్రివాడ భార్గవి తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మీడియా ముందు హత్య కేసు నిందితులను చూయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో హెచ్‌సీ బీరప్ప, చంద్ర, ప్రేమన్న, కానిస్టేబుళ్లు కె.తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, మల్లయ్య, జి.తిప్పన్న, రమేష్, తుకారాం, శివప్రసాద్, సుధాకర్‌లు టీంగా ఏర్పడి హత్యల కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టారన్నారు. ఆదివారం సాయంత్రం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశామన్నారు. తాజాగా అదుపులోకి తీసుకున్న 13 మందితో కలిసి అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 25కు చేరిందన్నారు. వీరి నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పికెట్ ఏర్పాటు చేశామన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో బాగా పనిచేసిన సీఐ, ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


