హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
కర్నూలు: ద్విచక్ర వాహనదారులకు ప్రాణాపాయం జరగకుండా ఉండటానికి రవాణా, పోలీసు శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద డీఐజీ/ఇన్‌చార్జి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాత కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్, కలెక్టరేట్ మీదుగా సి.క్యాంప్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఇన్‌చార్జి ఆర్‌టీఓ మల్లికార్జున, సీఐలు మన్సూరుద్దీన్, మధుసూదన్ రావు, పార్థసారధి, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, వివిధ షోరూమ్‌ల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
నో హెల్మెట్ – నో పెట్రోల్
రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈనెల 1 నుంచి కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలతో పాటు తనిఖీ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నో హెల్మెట్ – నో పెట్రోల్ విధానాన్ని కూడా అమలు చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద బోర్డులు పెట్టించి హెల్మెట్ లేనివారిని వెనక్కు పంపుతున్నారు.


