రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ చేసి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. సోమవారం కలెక్టరేట్‌లోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఈ నెల 22న నిర్వహించే విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిడుతూరు తహసీల్దారుగా పని చేసి 2024 జనవరి 31న పదవీ విరమణ పొందిన సిరాజుద్దిన్ ఈ సందర్భంగా తన గోడు వినిపించారు. కర్నూలుకు చెందిన ఈయనకు రెండేళ్లవుతున్నప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. 2024 జనవరి నెల నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఈయన పెన్షన్ ప్రపోజల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. జూన్‌లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారులు విశ్రాంత తహసీల్దారు పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే కనీసం పెన్షన్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. నిరంతర పోరాటంతో 9 నెలల క్రితం పెన్షన్ మంజూరైంది. ఇక ఏపీజీఎల్‌ఐ, ప్రాపిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, 10 నెలల సెలవు వేతనం ఇప్పటికీ చెల్లించని పరిస్థితి. దాదాపు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. రెవెన్యూ శాఖలో ఈయన ఒక్కరే కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే ఆవేదన.
బైక్ అదుపు తప్పి..
డోన్ టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఖాజా హుస్సేన్(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు పట్టణ సమీపంలోని యు. కొత్తపల్లెలో క్లీనిక్ నిర్వహిస్తూ ప్రతి రోజు బైకుపై కొత్తపల్లె గ్రామానికి వెళ్లి వచ్చేవాడు. విధి నిర్వాహణలో భాగంగా బైక్‌పై వెళుతుండగా వైఎస్, కోట్ల నగర్ కాలనీల మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచేందకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంద్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో నిరక్షరాస్యులుగా ఉన్న 1,61,914 మందిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. అక్షరాంధ్రలో భాగంగా నిరక్షరాస్యులకు డీఆర్‌డీఏ, మెప్మా, విద్యా వలంటీర్ల ద్వారా చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, వయోజనవిద్య డీడీ చంద్రశేఖరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్, సీపీఓ భారతి, డివిజినల్ పంచాయతీ అధికారి తిమ్మక్క పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ విజేత అనంతపురం
కర్నూలు (టౌన్): నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ స్థాయి మహిళల ఇన్విటేసన్ ఫుట్‌బాల్ టోర్నమెంటు సోమవారం సాయంత్రం ముగిసింది. ఫైనల్ పోరులో చైన్నె మాసి మహిళల జట్టుపై 1–0 గోల్స్‌తో అనంతపురం ఆర్‌డీటీ జట్టు విజేతగా నిలిచి కప్పు కై వసం చేసుకుంది. మూడవ పట్టణ సీఐ శేషయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పీడీ శ్రీనివాస రెడ్డి, టోర్నీ ఆర్గనైజేషన్ కార్యదర్శి బ్రహ్మకుమార్ పాల్గొన్నారు.
రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్
రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్


