కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో నరికి!
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై
టీడీపీ నాయకులపై హత్యాయత్నం
● హాలహర్విలో దారుణం
ఆలూరు/హాలహర్వి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు కత్తులు దూశారు. కళ్లల్లో కారం చల్లి హత్యాయత్నం చేశారు. ఆదివారం మధ్యాహ్నం హాలహర్విలో ఈ దారుణం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలకు గురైన బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌సీపీలో కార్యకర్తలుగా హాలహర్వి గ్రామానికి చెందిన బల్లూరు కురుబ వీరేశప్ప(60), అతని భార్య పార్వతి, కుమారులు బల్లూరు కురుబ గాదిలింగప్ప, సోదరుడు బల్లూరు కురుబ సురేష్ ఉన్నారు. వీరికి ఇంటికి సమీపంలో టీడీపీ నాయకులు కురుబ లక్ష్మన్న, అతని కుమారులు కురుబ గాదిలింగప్ప, కురుబ నాగప్ప, కురుబ రమేష్ తదితరులు ఉన్నారు. అధికారంలో ఉండటంతో చిన్న విషయమై ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. కళ్లలోకి కారం చల్లి కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కురుబ గాదిలింగప్పను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బల్లూరు కురుబ వీరేశప్ప, అతని భార్య పార్వతి, కుమారులు బల్లూరు గాదిలింగప్ప, బల్లూరు కురుబ సురేష్‌ను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు, వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ ఆలూరు మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ బీసీసెల్ కార్యదర్శి భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మల్లయ్య తదితరులు ఉన్నారు. దాడి వెనుక ఎంపీ స్థాయిలో ఉన్న టీడీపీ నేత ఉన్నారని ఆరోపించారు.
కళ్లల్లో కారం చల్లి.. కత్తులతో నరికి!


