కర్నూలులో వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): సాయుధ పోరాట వీరుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు కోసం వడ్డెరులు కొన్ని ప్రదేశాలను సూచించారని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, వడ్డ్డెర సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైనాధ్యక్షుడిగా వడ్డె ఓబన్న అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. కొండారెడ్డి బురుజు నుంచి అలంపూర్ వరకు ఉన్న టన్నెల్(సొరంగం) అభివృద్ధి చేయాలని కొందరు వడ్డెరులు కోరారని, దీనిని పరిశీలిస్తామన్నారు. అంతకముందు బీసీ భవన్‌లో వడ్డె ఓబన్న చిత్ర పటానికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కె.ప్రసూన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంతం, మహిళా అధ్యక్షురాలు చంద్రిక, సంస్కృత భాష ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు, జైపాల్‌బాబు తిరుపాల్‌బాబు, వెంకటస్వామి, సత్యనారాయణ, జానకీ రామ్, శివుడు పాల్గొన్నారు.


