గాయపడిన యువకుడి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన చాకలి మహేంద్ర(21), కురువ భరత్ కర్నూలు ఫర్‌మెన్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. భరత్‌కు సంబంధించిన కూరగాయలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు శనివారం సాయంత్రం ఆటోలో పంపారు. భరత్ తన మోటారు సైకిల్‌పై స్నేహితుడు మహేంద్రతో కర్నూలుకు బయలుదేరారు. కూరగాయలు అమ్ముకొని రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద బైక్ అదుపుకాకపోవడంతో వెనకాల కూర్చున్న మహేంద్ర కింద పడి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మహేంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు.
ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి
మద్దికెర: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్రమాదం మద్దికెర– పత్తికొండ రోడ్డులో బురుజుల గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ట్రాక్టర్ మట్టి తీసుకుని వచ్చే నిమిత్తం పత్తికొండకు వెళ్తూ అదుపుతప్పింది. తగ్గులో ఉన్న పొలాల్లోకి వెళ్లి వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన దొడ్ల బోయకిష్టప్ప (64) అనే వ్యక్తిపై ట్రాలీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌లో ఉన్న గుంతకల్లుకు చెందిన శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని 108లో గుంతకల్లుకు తరలించారు. విషయం తెలుసుకున్న మద్దికెర ఎస్‌ఐ హరిత పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యువకులకు తప్పిన ప్రమాదం
మహానంది: నంద్యాల పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆదివారం మహానందికి వచ్చారు. మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు నంద్యాలకు వెళ్తుండగా పర్యావరణ కేంద్రం దాటిన తర్వాత వారి ముందు ఓ బైక్ వెళ్తుండటంతో తగులుతుందేమోనని సడన్ బ్రేక్ వేశారు. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వస్తుండటం, ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బైకును కాల్చిన దుండగులు
మహానంది: గోపవరం గ్రామంలో బైకుకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం మల్లికార్జున తన ఇంటి ముందు బైకును పెట్టి నిద్రించారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు బైకుకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తాము నిద్రిస్తున్నామని, కాలిన వాసన, మంటలతో కూడిన శబ్ధం రావడంతో బయటికి వచ్చే సరికి బైక్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
మహానంది: ప్రమాదవశాత్తూ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విజయ్‌కుమార్(13) ఈ నెల 6న పాఠశాల ఆవరణలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూ లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలు కోలేక ఆదివారం ఉదయం మృతి చెందినట్లు మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సాంబవరం గ్రామానికి చెందిన ప్రతాప్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు విజయ్‌కుమార్, మరో కుమార్తె ఉన్నారు. 13 ఏళ్లకే కుమారుడికి నిండు నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ లేక పోవడంతో విద్యార్థుల ప్రాణాలకు భద్రత కరువైందని స్థాని కులు విమర్శిస్తున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారు లు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలో కొన్నేళ్లు గా పని చేస్తున్న వారిని మార్చి, కొత్తవారిని నియమించి, విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నారు.
గాయపడిన యువకుడి మృతి


