సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల ఆలయం మస్తాబు అయింది. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంగా సోమవారం ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. అలాగే మహాగణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం జరిపిస్తారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, ఽ7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!


