దామోదరం జయంతిని ‘సాధికారత’గా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 లేదా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11వ తేదీని సామాజిక సాధికారత దినంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో దామోదరం సంజీవయ్య తొలి దళిత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర కల్కూర, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, మానవశక్తి పరిశోధన కేంద్ర వ్యవస్థాపకుడు ఎస్‌ఏ రెహమాన్, కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం.హర్ష తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దామోదరం సంజీవయ్య ఎన్నో విప్లవాత్మక, సామాజిక మార్పులు తెచ్చారన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సాధికారతకు కృషి చేసిన నేపథ్యంలో దామోదరం సంజీవయ్యకు గౌరవంగా సాధికారత బహుమానం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈమేరకు సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడి సాధికారత దినోత్సవం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు.


