జ్ఞాపకాల జాడలో సేవా పరిమళం
● వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ● నేడు ఆత్మీయ సమ్మేళనం
వెల్దుర్తి: దాదాపు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న పాఠశాల ఇది. 67 ఏళ్ల క్రితం పదో తరగతి మొదటి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారు. వీరంతా ఏటా జనవరి నెల మొదటి ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం క్రమేణా పాఠశాల అభివృద్ధి సేవా కార్యక్రమంగా మారిపోయింది. వారు చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల మొట్టమొదటి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (పదవ తరగతి) బ్యాచ్ 1958లో పూర్తి చేసుకుంది. చుట్టుపక్కల హైస్కూళ్లు లేని కాలం నుంచి ఏర్పాటైన ఈ పాఠశాలలో చదివిన వారిలో వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్, ఓర్వకల్, కల్లూరు, కోడుమూరు మండలాల వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ చదివిన చాలా మంది ఉన్నత, మహోన్నత స్థానాలలో ఉన్నారు. నాటి నుంచి చదివిన విద్యార్థులలో 1967 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన వావిలాల కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ‘వెల్దుర్తి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థుల సేవా సంఘం’ ఏర్పడి 2015లో రిజిస్టర్ అయి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 335 మంది సభ్యుల (పూర్వ విద్యార్థులు)తో కొనసాగుతోంది.
పాఠశాల అభివృద్ధికి కృషి
సభ్యుల సహకారంతో తాము చదివిన పాఠశాలలో (విడిపోయిన బాలికల జెడ్పీ హైస్కూల్‌లో) నీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు ఇచ్చారు. భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించారు. ఏటా పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, పరీక్షలలో ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతేడాది సమావేశంలో పట్టణానికి చెందిన అగస్టీన్ అధ్యక్షుడిగా, ఖాజాబేగ్ ఉపాధ్యక్షుడిగా, మల్లెపల్లె సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి సెక్రటరీగా పూర్తి కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నేడు బాలికల జెడ్పీహైస్కూల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అదే పాఠ శాలలో చదివి, అక్కడే ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి రిటైర్ట్ అయిన 1958 బ్యాచ్ శంకరయ్య, 1962 బ్యాచ్ బోయనపల్లె కృష్ణమోహన్ రెడ్డిని ఆదివారం సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేశారు.
జ్ఞాపకాల జాడలో సేవా పరిమళం


