టీడీపీ నేత దాడి
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై
● ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు ● న్యూ ఇయర్ వేడుకల్లో బైక్ ర్యాలీ చేశారని కక్ష
నందవరం: అధికార దర్పంతో టీడీపీ నాయకులు ఊరూరా బరితెగిస్తున్నారు. పోలీసుల అండతో దాడులకు తెగబడుతున్నారు. కనకవీడు గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం కనకవీడు గ్రామానికి చెందిన వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి తమ నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎమ్మిగనూరుకు బయలు దేరారు. గ్రామంలో ర్యాలీ చేస్తుండగా టీడీపీ నాయకుడు బోయ ఈరన్న కావాలనే అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ జెండా ఎగరవేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అయినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొడవకు దూరంగా ఉంటూ సజావుగా ర్యాలీ చేశారు. ఈ విషయంలో కక్ష పెంచుకున్న బోయ ఈరన్న శనివారం గ్రామంలో ఉదయం వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురవ విరుపాక్షిపై దొడ్డు కర్రతో దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన విరూపాక్షి బావమరిది కురవ సూరి తలపై కొట్టాడు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ సుభాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అధైర్య పడొద్దు : ఎర్రకోట రాజీవ్‌రెడ్డి
ప్రతి కార్యకర్తకు, నాయకుడికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఓర్వలేకనే తమ కార్యకర్తలపై దాడి చేశారని విమర్శించారు. నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి, నాయకులు పెద్ద ఈరన్న, కురవ గోవిందు, చంద్రబాబు, నరసింహులు, స్వామిదాసు, వెంకటరాముడు, బోయ రాజు, కురవ రంగస్వామి, శివ, రామలింగడు, ఈరన్న, మత్తయ్య, సిమెన్ ఉన్నారు.


