హంద్రీ నది ఎండి .. గొంతులు తడారి
గోనెగండ్ల: హంద్రీనది పూర్తిగా ఎండిపోయింది. నదీ పరివాహక గ్రామాల్లోని బోర్లు, బావుల్లో జలం అడుగంటి పోతుంది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, హెచ్. కై రవాడి, వేముగోడు, తిప్పనూరు గ్రామ సమీపంలోని హంద్రీనది పూర్తిగా ఎండిపోవడంతో అక్రమార్కులు కొందరు రోజుకు 20 నుంచి 30 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. హంద్రీ పరివాహక గ్రామాలైన హెచ్. కై రవాడి, పుట్టపాశం వేముగోడు, తిప్పనూరు తదితర గ్రామాల్లో బోర్లు పనిచేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హంద్రీ నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రమవుతుందని భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హంద్రీనదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రావాణాను అరికట్టి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


