ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి చూపాలి
కర్నూలు(హాస్పిటల్): ట్రాన్స్‌జెండర్లకూ సంక్షేమ పథకాలు అందించాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని బెంగళూరులోని వైదేహి మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ ఎన్. జగదీష్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో రెండురోజులుగా కొనసాగుతున్న ఫోరెన్సిక్ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. జగదీష్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్స్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ యాక్ట్ 2020లో వచ్చిందన్నారు. ఇతరుల మాదిరిగానే ట్రాన్స్‌జెండర్లకూ ఆరోగ్య సమస్యలు ఉంటాయని, వాటి గురించి వైద్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇటీవల కాలికట్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రసవనొప్పులతో వచ్చారని, ఇలాంటి వారికి ఏ విధమైన చికిత్సను అందించాలో వివరించారు. కొందరు పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. కొంత మంది ట్రాన్స్‌జెండర్స్ భిక్షాటన చేస్తూ అల్లరి చేస్తున్నారని, వారిని ఎలా నియంత్రించాలో అర్థం కావడం లేదని చెప్పారు. దీనిపై డాక్టర్ జగదీష్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్‌జెండర్స్ అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించిందన్నారు. వారికి సంక్షేమ పథకాలు అందించడమే గాక నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. చాలా మంది ఆరోగ్య సమస్యలున్నా ఆసుపత్రికి వచ్చి చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వారికి ఆన్‌లైన్ ద్వారా ఉన్నచోటే వైద్యుల సలహాలు, సూచనలతో వైద్యం అందుకునే వెసలుబాటు ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఇందుకు వారు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనాఽథలైన ట్రాన్స్‌జెండర్లకు ఆశ్రయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం గరీమా గృహ ప్రారంభించిందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ అని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని, సంక్షేమ పథకాలు పొందాలంటే మాత్రం గుర్తింపుకార్డు ఉండాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు ఫోరెన్సిక్ వైద్యులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసీ రంగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె. నాగార్జున, డాక్టర్ వి. కోటేశ్వరరావు, డాక్టర్ పి. హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ మహమ్మద్ సాహిద్ పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ జగదీష్


