ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి
కర్నూలు సిటీ: ఉపాధ్యాయులందరూ పోరాటాలు చేసి ప్రభుత్వ బడిని కాపాడుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సీక్యాంపులో ఆదివారం యూటీఎఫ్ నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్ అధ్యక్షతన విద్యా రంగ సవాళ్లు–కర్తవ్యాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం ప్రశ్నించేతత్వం లేకుండా చేస్తోందన్నారు. పాలక వర్గాల ప్రయోజనాల కోసమే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించకుండా ఇతర పనులు చేయిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే 117 జీఓ రద్దు చేస్తామని పాదయాత్రలో లోకేష్ హామీనిచ్చారని, దాన్ని రద్దు చేయకుండా ప్రత్యామ్నాయం కోసం కసరత్తు చేస్తున్నారన్నారు. 2018లో 38 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేవారని, కానీ నేడు అది 32.61 లక్షల మందికి తగ్గిందన్నారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్‌సీ ఏర్పాటు చేయాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు జయచంద్రారెడ్డి, లక్ష్మీరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, పూర్వ గౌరవ అధ్యక్షులు నరసింహూలు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.వి రమణయ్య, సుబ్బారెడ్డి, పూర్వ సహాధ్యక్షుడు నాగమణి, పూర్వ కార్యదర్శి కోటేశ్వరప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు హేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్. వెంకటేశ్వర్లు


