సమాజ సేవకు పూలే జీవితం అంకితం
కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా నగరంలోని బిర్లాగేట్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరావు, రాయలసీమ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ విజయ్‌కుమార్, జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన, వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రామక్రిష్ణతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన జయంతి సభలో కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి పూలే అని కొనియాడారు. విద్య, అవగాహన లేకపోవడం వల్ల సీ్త్రలు బాగా వెనుకబడి ఉన్నారని గ్రహించిన ఆయన సత్యశోధక్ సమాజాన్ని తీసుకొచ్చారన్నారు. తన సతీమణి సావిత్రీబాయికి చదువు చెప్పించి ఒక పాఠశాలను స్థాపించారన్నారు. జ్యోతిబా పూలే విగ్రహం వద్దే సావిత్రిబాయి విగ్రహం ఏర్పాటుకు, మెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.20 లక్షలతో అంబేద్కర్ భవన్ పనులు జరుగుతున్నాయని, ఎస్సీ వసతి గృహాలకు రూ.7 కోట్లు వచ్చాయని, బీసీ వసతి గృహాలకు రూ.50 లక్షల డీఎంఎఫ్ నిధులతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
● కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే కుల వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు. విద్యకు ప్రోత్సాహం ఇచ్చి అందరిని చైతన్యవంతులను చేశారన్నారు. జిల్లాలో తాత్కాలికంగా మూతపడిన బీసీ వసతి గృహాలను వచ్చే విద్యా సంవత్సరంలో పునః ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో బీసీ భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరయ్యాయన్నారు.
● పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫూలేను తన గురువుగా చెప్పుకున్నారంటే ఆయన ఆశయాలు, వ్యక్తిత్వం ఎంత గొప్పవో అర్థమవుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11.77 లక్షల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు.
● కార్యక్రమంలో జిల్లా బోయ, కురువ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ల డైరెక్టర్లు మురళీ, సంజీవలక్ష్మి, మంజునాథ్, వెంకటరాముడు, కె.రామకృష్ణ, విజయ్‌కుమార్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమాజ సేవకు పూలే జీవితం అంకితం


