ఆయకట్టు.. పండితే ఒట్టు!
జిల్లోలో ఆయకట్టు వివరాలు...
ప్రాజెక్టు, కాలువ పేరు విస్తీర్ణం
ఎకరాల్లో..
కేసీకేసీ కెనాల్ 3,763
తుంగభద్ర దిగువ కాలువ 1,51,134
ఆలూరు బ్రాంచ్ కెనాల్ 14,255
హంద్రీనీవా కాలువ 60,000
గాజులదిన్నె ప్రాజెక్టు 24,372
చిన్న నీటిపారుదల శాల పరిధి 27,707
ఎత్తిపోతల పథకాల కింద 20,000
● నీటి మూటలైన టీడీపీ నేతల హామీలు
● పూర్తికాని సాగునీటి పథకాలు
● అరకొర సాగునీటి విడుదల
● పొలాల్లో ఎండుతున్న పంటలు
కర్నూలు సిటీ: తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో పెండింగ్ సాగుప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. గాలేరు– నగరి, హంద్రీ– నీవా ప్రాజెక్టుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని మెనిఫేస్టోలో ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మరచిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. రైతులకు ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయి. సాగునీరు అందక కళ్ల ముందే పంటలు ఎండుతుండటంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతుల క‘న్నీటి’ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాత్కాలిక బడ్జెట్, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులో మొండిచేయి చూపారు.
ఇదీ దుస్థితి..
● తుంగభద్ర నదిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆయకట్టుకు కేటాయించిన నీటిని అందించలేకపోయారు.
● ఈ ఏడాది తుంగభద్ర దిగువకాలువకు 22.47 టీఎంసీలు కేటాయించారు. కేటాయింపులో తాగు నీటికి పోగా.. 18 టీఎంసీలకుపైగా ఆయకట్టుకు అందించాలి. జలవనరుల శాఖ అధికారుల గణాంకాల ప్రకారమే ఖరీఫ్, రబీలో సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేకపోయారు.
● టీబీ డ్యాంలో 2 టీఎంసీలకుపైగా నీటి వాటా ఉంది. సకాలంలో వినియోగించుకోకపోవడంతో ఆ నీటిని సైతం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి.
● తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టుకుప్రస్తుతం నీటిని బంద్ చేశారు. కేవలం తాగుకు మాత్రమే ఈ నెల 10 వరకు కాలువకు నీరు ఇస్తున్నారు.
● తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కెనాల్‌కు 9.363 టీఎంసీల నీరు కేటాయించారు. ఇందులో 3.5 టీఎంసీల నీరు హెచ్చెల్సీకి మళ్లించారు. మిగిలిన నీటిలో గత నెలలో 1.61 టీఎంసీలు విడుదల చేస్తే జిల్లాకు 0.6 టీఎంసీ నీరు కూడా చేరలేదు. దీంతో జిల్లా పరిధిలోని కేసీ ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
● శ్రీశైల జలాలపై ఆధారపడిన హంద్రీ– నీవా కాలువకు సమృద్ధిగా నీరు ఇవ్వడం లేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గత నెల రెండో వారానికి నీటిని బంద్ చేశారు. హంద్రీ– నీవా కాలువ వెంబడి సాగు చేసిన రైతులు, హాలహర్వి మండలంలోని చింతకుంట గ్రామంలో సుమారు 600 ఎకరాలకుపైగా వరి పంటను కోల్పోయారు.
● గాజులదిన్నె ప్రాజెక్టుకు కేటాయించిన 3 టీఎంసీలు ఇవ్వలేకపోయారు. హంద్రీ– నీవా కాలువ నుంచి కూడా మూడు నెలలు ఆలస్యంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీరు ఇచ్చారు. దీంతో 24 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకే నీటిని సరిపెట్టారు.
కష్టాలు ఇవీ..
ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు చేరినప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయకట్టులో చివరి దశలో ఉన్న పంటలు ఎండిపోయాయి. రైతులకు క‘న్నీటి’ కష్టాలు మిగిలాయి. గ్రామీణ ప్రాంతాలకు గుక్కెడు తాగునీటిని ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. నీటి వనరుల కొరతతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలసలు పోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు చేపట్టిన వేదావతి ప్రాజెక్టుకు భూసేకరణ సమస్య వేధిస్తోంది. పనులు వేగంగా చేసేందుకు ఏజేన్సీ ఆసక్తి చూపడం లేదు. ఆర్డీఎస్ కుడి కాలువకు సైతం భూసేకరణ సమస్య ఉంది. పక్క రాష్ట్రం ఫిర్యాదుతో పనులు జరగడం లేదు.
బడ్జెట్ రావాల్సి ఉంది
ఇటీవలే వేదావతి ప్రాజెక్టుకు కొంత బడ్జెట్ కేటాయించారు. ఆర్థిక సంవత్సరం మొదలైంది. బడ్జెట్ వస్తే పనుల విషయం తెలుస్తుంది. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుకు నీరొస్తుంది. కేసీ పరిధిలో 0 నుంచి 120 కి.మీ వరకు రబీ ఆయకట్టు లేదు. అయినా కొన్ని తడులకు నీరిచ్చాం.
– కబీర్ బాషా, సీఈ,
జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు
ఆయకట్టు.. పండితే ఒట్టు!
ఆయకట్టు.. పండితే ఒట్టు!


