‘స్పాట్’కు స్కూల్ అసిస్టెంట్లు కావలెను
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకన ప్రక్రియలో స్కూల్ ఆసిస్టెంట్ల (ఎస్‌ఏ) పాత్ర చాలా కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) నియమించాల్సి ఉంది. ఏప్రిల్ 3 నుంచి జిల్లాలో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 2 లక్షలకు పైగా జవాబు పత్రాలు రానున్నాయి. ఇప్పటికే తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, గణితం, బాటనీ పరీక్షల జవాబు పత్రాలు చేరాయి. నంద్యాలలోని ఎస్‌డీఆర్ పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరిచారు. అయితే స్పాట్‌కు సుమారు 200 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు అవసరం కాగా, ఇప్పటి వరకూ ఆ విధులు నిర్వర్తించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏటా ఇదే తంతు కొనసాగుతూ వస్తున్నా... గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్పు కోకపోవడం గమనార్హం. స్కూల్ అసిస్టెంట్ల విషయంలో ఈసారి కూడా గత ఏడాది పరిస్థితులే ఎదురయ్యాయి. ముందుగానే అప్రమత్తమవుతున్నామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి మండలం నుంచి కనీసం 10 మంది టీచర్లను ఎంపిక చేసి స్కూల్ అసిస్టెంట్ల విధులకు పంపాలని డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మంత్రాంగం ఎంత మాత్రం పని చేస్తుందనేది మూల్యాంకనం ప్రారంభమైన తొలిరోజు తెలిసిపోతుంది.
స్కూల్ అసిస్టెంట్ల విధులు ఇలా..
మూల్యాంకనంలో చిన్నపాటి తప్పిదం జరిగినా నష్టపోయేది విద్యార్థులే. అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత ఆ జవాబు పత్రాన్ని స్కూల్ అసిస్టెంట్లు తీసుకుని మార్కుల పోస్టింగులు, టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. చిన్నపాటి తప్పిదాలకు తావివ్వకుండా ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్కూల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివ రాలను ధ్రువీకరించాల్సి ఉంది. అయితే మూ ల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే స్కూల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. పైగా డీఏ వెసులుబాటు ఉండదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు ఆసక్తి చూపడం లేదు.
సమస్యను అధిగమిస్తాం
ఏప్రిల్ 3న పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపక పోవడమనేది ప్రతి ఏటా ఎదురవుతున్న సమస్యనే. ఈసారి ఈ సమస్యను అధిగమిస్తాం. వీలైనంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే డీవైఈఓలు, ఎంఈఓలకు లేఖలు రాశాం. ప్రతి మండలం నుంచి కనీసం పదిమంది టీచర్లను స్పెషల్ అసిస్టెంట్లుగా పంపాలని చెప్పాం.
– జనార్ధన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల
ఏప్రిల్ 3 నుంచి
పది మూల్యాంకనం ప్రారంభం
స్కూల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు
ఆసక్తి చూపని ఉపాధ్యాయులు
ఏటా ఇదే తంతు...
గత అనుభవాలతో
గుణపాఠం నేర్వని విద్యాశాఖ


