● వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు ● ఆ
దేవుడే కాపాడాడు
పత్తికొండ: త్రుటిలో మరో బస్సు ప్రమాదం తప్పింది. జిల్లాలో మూడు నెలల క్రితం చిన్నటేకూరు బస్సు దుర్ఘటన ఇంకా కళ్ల ముందే కదిలాడుతోంది. అదే తరహాలో మరో బస్సు ప్రమాదం జరగకుండా దేవుడే కాపాడినట్లుగా అనిపించింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నా రు. బస్సు ముందు భాగం మంటలు వ్యాపించి బస్సులోకి వ్యాపిస్తున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ల కారణంగా బస్సు వేగం నెమ్మదించడం, బస్సు డ్రైవర్లు మంటలను గుర్తించి నిలపడం, అదే సమయంలో అక్కడ బడేరాత్ సందర్భంగా జాగారంలో ఉన్న ముస్లిం యువకులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం రాత్రి మంత్రాలయం నుంచి 15 మంది ప్రయాణికులతో కర్ణాటకకు చెందిన శాన్వి ట్రావెల్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో పత్తికొండ సమీపంలో ఉరుకుంద వీరన్న స్వామి ఆలయం ఉంది. అక్కడ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో బస్సు వేగం నెమ్మదించింది. అప్పటికే బస్సు రేడియేటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బస్సులోకి వ్యాపిస్తున్నాయి. మంటలను గుర్తించి డ్రైవర్ పక్కనే బస్సును నిలిపి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దిగమని సూచించారు. అంతలో శుక్రవారం బడేరాత్ సందర్భంగా పక్కనే ఉన్న దర్గాలో జాగారం చేస్తున్న ముస్లిం భక్తులు వెంటనే స్పందించారు. ఓ హోటల్‌లో ఉన్న నీటిని బిందెలతో తెచ్చి మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది సమాచారం అందుకుని అక్కడికి చేరుకుని మంటలను అదుపు లోకి తెచ్చారు. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్ బస్సులో ప్రయాణికులు పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రావెల్ బస్సును చూసి ‘దేవుడి దయతోనే పెను ప్రమాదం తప్పింది’ అని ప్రజలు చర్చించుకుంటూ కనిపించారు.


