శ్రీశైలంలో వేదశ్రవణం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో వేదశ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అమ్మ వారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. అలాగే రుత్విగ్వరణ కార్యక్రమంలో వేదపండితులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపఠన కార్యక్రమం జరిపించారు. మూడు గంటల పాటు నిరంతరాయంగా వేదపారాయణాలు కొనసాగాయి. దేవస్థాన వేదపండితులతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి (విజయవాడ) దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు తిరుపతి, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదపారాయణం చేశారు. దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి హాజరైన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కై ంకర్యంగా రెండు గంటల పాటు ఘనస్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


