వ్యక్తి అనుమానాస్పద మృతి
తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి సమీపంలో శనివారం రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తుగ్గలిలో నివాసముంటున్న మారెల్ల మంకె సునీల్‌కుమార్(37) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న డోన్ రైల్వే పోలీసులు ఘటనాస్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సునీల్‌కుమార్‌ది ఆత్మహత్య, ప్రమాదమా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
డోన్ టౌన్: వెంకటాపురం చెరువు పెద్ద వంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కౌలుట్ల శనివారం ఉదయం డోన్ నుంచి ఖాళీ బాక్స్ లోడ్‌తో స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో గుమ్మకొండ గ్రామానికి చెందిన సుధాకర్ బైకుపై డోన్‌కు వస్తుండగా ప్రమాదవశాత్తూ ఆటో, బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధాకర్‌కు తీవ్ర, కౌలుట్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌ను కర్నూలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు.
గంజాయి విక్రేత అరెస్టు
పెద్దకడబూరు: గంజాయి సాగుచేసి అమ్ముతు న్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అలాగే కొనడానికి వచ్చిన ఓంకారిని అరెస్ట్ చేశామన్నారు. జాలవాడి గ్రామానికి చెందిన మల్లికార్జున తన ఇంటి పక్కనున్న పొలంలో గంజాయి సాగు చేసి అమ్ముతున్నాడని సమాచారం అందిందన్నారు. విషయం తెలుసుకున్న తాము శనివారం కాపుకాచి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వారివద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


