దుకాణంలో అగ్ని ప్రమాదం
● రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం
బేతంచెర్ల: స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని శివ శక్తి బైక్ జోన్ దుకాణంలో ఆదివారం మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ కావడంతో నిర్వాహకుడు బాల కృష్ణారెడ్డి ఆదివారం ఉదయం పూజ నిర్వహించి దుకాణానికి తాళం వేసి వెళ్లాడు. అయితే కొద్ది సేపటి తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణంలో పొగలు రావడంతో స్థానికులు గమనించి యజమానికి సమాచారం ఇచ్చారు. దుకాణం తెరిచి చూసే సరికి మంటలు ఎక్కువై అందులోని రేడియం కటింగ్ మిషన్లు, ల్యాప్ టాప్, ఇన్వర్టర్, బ్యాటరీ, సీసీ కెమెరాలు రూ. 30 వేల నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.


