కర్నూలు: కర్నూలు శివారులోని సంతోష్‌నగర్ జంక్షన్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వహీద్(57) కోలుకోలేక మృతిచెందాడు. గీతాముఖర్జీ నగర్‌లో నివాసముంటున్న ఈయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. శనివారం రాత్రి గీతా ముఖర్జీ నగర్‌లోని తన ఇంటి నుంచి బైరెడ్డి రైస్‌మిల్ వద్ద ఉన్న మసీదుకు వెళ్లి ప్రార్థన ముగించుకుని సంతోష్ నగర్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న తన కుమారుడు సద్దాం ప్రమాదానికి గురైన తండ్రిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


