హోటళ్లపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల దాడులు
శ్రీశైలం: శ్రీశైలంలోని పలు హోటళ్లపై ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజగోపాల్ (కర్నూల్), నంద్యాల జీఎఫ్‌ఐ వెంకట్ రాముడు, ఎన్.రాముడు, ఎఫ్‌ఎస్‌ఓ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణి హోటల్లో గోబీ మంచూరియాలో కృత్రిమ కలర్లను వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కర్ణాటక సత్రం వద్ద ఉన్న మంజునాథ స్వీట్ షాపులో బఠానీలకు సింథటిక్ ఫుడ్ కలర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వాటన్నిటిని చెత్తకుప్పలో పారబోయించారు. అలాగే మరి కొన్ని హోటళ్లలో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు గుర్తించి పారబోయించారు. అనంతరం వారు మాట్లాడుతూ తనిఖీల్లో పలు హోటళ్ల నుంచి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.


