● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా నాలుగు స్థానాలు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలతో పాటు జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్‌కు ఓటింగ్ ● నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం నల్లేరుపై నడకే ● ఉదయం 10 గంటల్లోపు జెడ్పీ కోఆప్షన్ సభ్యుని నామినేషన్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో (జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ) ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్, కృష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ మరణించగా, వెల్దుర్తి ఎంపీపీ బి.సరళ, తుగ్గలి ఎంపీపీ ఆదెమ్మ తమ పదవులకు 2024 మార్చి 29న రాజీనామా చేశారు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంది. జెడ్పీ కోఆప్షన్ సభ్యుని ఎన్నికకు కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. నేటి ఉదయం 10 గంటల్లోపు నామినేషన్లను దాఖాలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, తదుపరి బరిలో ఉన్న జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారు. జెడ్పీలో మొత్తం చైర్మన్‌తో కలిపి 53 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు సభ్యులు మృతి చెదడం, ఒకరు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 50 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నేడు జరగనున్న ఎన్నికకు 50 శాతం కోరం ఉంటే (25 మంది సభ్యులు హాజరైతే) సమావేశంలో కోఆప్షన్ సభ్యు న్ని ఎన్నుకుంటారు. ఒకవేళ కోరం లేకపోతే మరుసటి రోజుకు ఎన్నిక వాయిదా పడ నుంది. కృష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కూడా ఇదే ప్రకారం నిర్వహించనున్నారు.
ఎంపీపీల ఎన్నిక ఇలా..
తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్‌ల్లో ఎంపీపీలను ఎన్నుకునేందుకు ముందుగా ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఎన్నిక పూర్తయిన అనంతరం సంబంధిత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన అంశాలన్నింటిని రికార్డు చేస్తారు. కృష్ణగిరికి సెల్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్, వెల్దుర్తికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, తుగ్గలికి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
ఐదు ఉప సర్పంచు స్థానాలకు కూడా ..
జిల్లాలోని దేవనకొండ మండలం వెలమకూరు, ఓర్వకల్లు మండలం గుట్టపాడు, ఆలూరు మండలం మొలగవెళ్లి, కర్నూలు మండలం సుంకేసుల, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో కూడా ఉప సర్పంచు స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు ఈఓఆర్‌డీలకు బాధ్యతలు అప్పగించామన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా వీడియోగ్రఫీ తీయించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రకియ ప్రారంభమవుతుందన్నారు.
మెజార్టీ సభ్యులు వైఎస్సార్‌సీపీ వైపే..
ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లోను వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించనున్నారు. జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం ఉన్న 50 మంది జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే కావడంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక లాంఛనమే. అలాగే కృష్ణగిరి మండల పరిషత్‌లో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒకరు మృతి చెందడంతో మిగిలిన 12 స్థానాల్లో ఒకటి టీడీపీ, మిగిలిన 11 స్థానాల్లోను వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలే ఉన్నారు. తుగ్గలిలో 17 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నారు. వెల్దుర్తిలో ఎంపీటీసీలు17 మంది ఉండగా, ముగ్గురు టీడీపీ, మిగిలిన 14 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక నల్లేరుపై నడకే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
‘స్థానిక’ ఖాళీలకు నేడు ఎన్నికలు!


