
ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు చెప్పారు. ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ వద్ద జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ మీదుగా మెడికల్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జి. నరేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలోని టీబీసీడీ వార్డులో క్షయ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో 42,297 మందిని పరీక్షించగా 5,162 మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసుధీర్, డీఐవో డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాలనాగాంజన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, డాక్టర్ మోక్షేశ్వరుడు, వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థినిలు పాల్గొన్నారు.
గ్రౌండ్ ట్రూతిం ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
కర్నూలు(సెంట్రల్): జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రీసర్వేపై రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..దాదాపు 100 సంవత్సరాల తరువాత చేపడుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి దశలో 472 రెవన్యూ గ్రామాలకుగాను 68 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు. వెబ్ ల్యాండ్ నుంచి వెబ్ ల్యాండ్ 2.0కు పోర్టింగ్ మారిన తొలి జిల్లా కర్నూలు అని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ మల్లికార్జునుడు, కర్నూలు ఆర్‌డీఓ హరిప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ పవన్‌కుమార్, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర నాగప్రసన్న లక్ష్మీ, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే విజయ సారథి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు