
అరకొరగా విత్తన కేటాయింపులు
విత్తన పంపిణీలో
అంతులేని నిర్లక్ష్యం
● వర్షాలు కురుస్తున్నా స్పందించని
ప్రభుత్వం
● బకాయిలు చెల్లిస్తేనే
విత్తన సరఫరా అంటున్న కంపెనీలు
● ఇప్పటి వరకు మొదలుకాని
ప్రాసెసింగ్ ప్రక్రియ
● గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో
మే 15 నుంచే పంపిణీ
● ఇప్పుడు అరకొర కేటాయింపులతో సరి
● వర్షాలు కురుస్తుండటంతో
దిక్కుతోచని రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనం అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మే నెల 15 నుంచే విత్తన పంపిణీ జరిగింది. వర్షాలు పడిన వెంటనే విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో విత్తుకునే అవకాశాన్ని కల్పించింది. 2024 ఖరీఫ్ సీజన్ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల సకాలంలో విత్తన పంపిణీ సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో విత్తన పంపిణీపై దృష్టి సారించని పరిస్థితి. సబ్సిడీ పంపిణీలో వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ప్రధానమైనవి. ఈ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సరఫరాకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు ఖరారు చేసినప్పటికీ సంబంధిత కంపెనీలు విత్తన సరఫరాకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు పెట్టలేదంటే పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు వేరుశనగ విత్తనం కాయల కోసం వ్యాపారులను ఆశ్రయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2024–25 బకాయిలు చెల్లిస్తేనే
విత్తన సరఫరా
రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్‌కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ, రబీ సమయంలో సరఫరా చేసిన శనగ(బెంగాల్‌గ్రామ్), ఇతర విత్తనాలకు ఏపీ సీడ్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్‌కు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఏపీసీడ్స్‌కు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వల్ల సరఫరా చేసిన కంపెనీలకు నగదు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ కంపెనీలు బీష్మించాయి.
విత్తనాల కోసం రైతులకు తప్పని తిప్పలు
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా విత్తన పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ విషయమై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉండటంతో రైతులు విత్తనాల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ క్వింటా ధర రూ.6,500 ఉండగా.. వ్యాపారులు ఉన్నట్లుండి ధరను పెంచేశారు. ఈ సారి విత్తనాల పంపిణీ దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడం వ్యాపారులకు కలసి వస్తోంది. ధరలను అడ్డగోలుగా పెంచి దోపిడికి పాల్పడే ప్రమాదం ఏర్పడింది.
పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సమస్య
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నందున పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి సాగవుతోంది. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లిపెసర, సన్‌హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఇందువల్ల భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జిల్లాకు కనీసం 3,500 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ వద్ద కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల కోసం రైతులు వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలను అందుబాటులో పెట్టకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్‌లో వేరశనగ ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 54,170 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాగు చేపట్టేందుకు 32,181 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు.
ఆయా జిల్లాల అధికారులు వినతిని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
ఉమ్మడి జిల్లాకు తూతూమంత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది.
సాధారణంగా గత ఏడాది ఏఏ విత్తనం ఏ మేర పంపిణీ అయిందో దానికి అనుగుణంగా విత్తనాలను కేటాయిస్తారు.
గత ఏడాది ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాకు 14,395 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,062.7 క్వింటాళ్ల ప్రకారం విత్తన పంపిణీ జరిగింది.
కనీసం ఈ ప్రకారమైన కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి.
కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లతో సరిపెట్టడం గమనార్హం.
ఈ కేటాయింపులు చూసి అధికారులు పంపిణీ ఎలా చేపట్టాలోనని తలలు పట్టుకుంటున్నారు.

అరకొరగా విత్తన కేటాయింపులు

అరకొరగా విత్తన కేటాయింపులు