
చిరుద్యోగుల ఆకలి కేకలు పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జల్లా అధ్యక్షుడు రంగస్వామి అఽధ్యక్షతన చేపట్టిన దీక్షను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, సీఐటీయూ న్యూసిటీ కార్యదర్శి సీహెచ్ సాయిబాబా, ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ ప్రారంభించారు. అంతకముందు డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరు తూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల ఆకలి కేకలను విస్మరిస్తోందన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ సెలవులను కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు పవన్‌కుమార్, కిరణ్, సురేష్, చిరంజీవి, కోశాధికారి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
396 మంది గైర్హాజరు
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షలకు రెగ్యులర్ టెన్త్‌కు 603 మంది విద్యార్థులకుగాను 207 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 396 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 280 మందికిగాను 258 మంది హాజరుకాగా 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 152 మందికిగాను 127 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు.