
21 నుంచి యోగాంధ్ర మాసోత్సవం
కర్నూలు(సెంట్రల్): జూన్ 21న అంతర్జాతీయయోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి యోగాంధ్ర మాసోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రజలు యోగాలో పాల్గొందుకు అవసరమైన, అనువైన స్థలాన్ని గుర్తించాలని మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, అడిషినల్ ఎస్పీ హుస్సేన్ పీరాలను ఆదేశించారు. యోగాకు సంబంధించిన పాటలు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలను పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ శామ్యూల్‌పాల్, ఇంటర్మిడియట్ అధికారి(ఆర్‌ఐఓ) గురువయ్య శెట్టి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్‌ను ఆదేశించారు. ప్రజలందరూ యోగాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతి కళ, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు రమణారెడ్డి, నాగశివలీల పాల్గొన్నారు.