రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం

May 21 2025 1:19 AM | Updated on May 21 2025 1:45 AM

● జీవనోపాధి కోల్పోనున్న 409 మంది ఆపరేటర్లు, 409 మంది హెల్పర్లు ● మళ్లీ రేషన్‌ దుకాణాలకుక్యూ కట్టాల్సిన పరిస్థితి

కర్నూలు(సెంట్రల్‌): గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలకు కూటమి సర్కార్‌ మంగళం పాడింది. జూన్‌ 1వ తేదీ నుంచి రేషన్‌ షాపుల్లోనే బియ్యం, ఇతర నిత్యావసరాలను ఇవ్వాలని మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ప్రజలే రేషన్‌ షాపులను వెతుక్కుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లు భగ్గుమంటున్నారు.

మళ్లీ రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులే..

కర్నూలు జిల్లాలో 6,34,631 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 12.65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో పేద, మధ్యతరగతి ప్రజలే అధికం. 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీకి ముందు వరకు రేషన్‌ షాపుల ద్వారా ప్రజలు సరుకులను పొందేవారు. అయితే కొన్ని గ్రామాల్లో షాపులు లేకపోవడం, పట్టణాల్లో కిలోమీటర్ల దూరంలో రేషన్‌ చౌకధరల దుకాణాలు ఉండడంతో సరుకుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అంతేకాక గంటల కొద్దీ వేచి చూడక తప్పని పరిస్థితి. డీలర్లు ఎప్పుడు వస్తే అప్పుడు సరుకులను తీసుకోవాల్చి ఉండేది. తూకాల్లో మోసం చేయడం, నిలదీస్తే అసలు బియ్యమే వేయని ఘటనలు కోకొల్లలు. ఈక్రమంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఇళ్లకు డెలివరీ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎంతో సౌకర్యంగా, వ్యయప్రాయాసలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ నిర్ణయాలను అక్కసుతో వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఎండీయూ వాహనాలను అర్ధాంతరంగా తొలగించింది. మళ్లీ రేషన్‌ దుకాణాల ద్వారానే నిత్యావసరాలను సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు

కర్నూలు జిల్లాలో 409 ఎండీయూ వాహనాలు ఉన్నా యి. ప్రతి వాహనానికి ఒక ఆపరేటర్‌, ఒక హెల్పర్‌ ఉంటారు. వీరికి వాహనం నడిపేందుకు అవసరమైన ఖర్చుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.21 వేలు చెల్లిస్తుంది. ఇందులో రూ.3వేలు వాహనం కంతు, రూ.3వేలు పెట్రోలు, రూ.5వేలు హెల్పర్‌కు ఇస్తారు. మిగిలిన రూ.10 వేలు ఆపరేటర్‌ వేతనంగా జమ చేసుకుంటారు. ఈక్రమంలో ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడాల్సి వస్తోంది. వారి నోటి కాడి కూడును ప్రభుత్వం లాగేస్తోంది.

కర్నూలు నగరంలో ఎండీయూ వాహనం ద్వారా రేషన్‌ సరుకులు తీసుకుంటున్న ప్రజలు (ఫైల్‌)

ఉపాధి కోల్పోతాం

నేను నాలుగేళ్ల నుంచి ఎండీయూ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తు న్నా. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల ప్రజలకు ప్రతి నెలా 1–16 మధ్య బియ్యం, ఇతర సరుకులను పేదలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నాం. బండి ద్వారా నాకు, నా హెల్పర్‌కు జీవనోపాధి లభిస్తోంది. బండ్లను నిలిపివేస్తే ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతాం. – నవీన్‌రాజు, ఈ.తాండ్రపాడు,

కర్నూలు రూరల్‌ మండలం

మేము రోడ్డున పడతాం

ఎండీయూ వాహనాల ద్వా రా ఉపాధిని పొందుతు న్నాం. పేదలకు రేషన్‌ సరు కులు ఇస్తుంటే సంతోషంగా ఉంటోంది. ఈ బండి ద్వారా నెలకు రూ.10వేల ఆదాయం వస్తుంది. అది లేకపోతే మేం రోడ్డున పడతాం. ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. మా జీవితాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు.

– సురేంద్రబాబు,

బళ్లారి చౌరస్తా ఏరియా, కర్నూలు

రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం 
1
1/2

రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం

రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం 
2
2/2

రేషన్‌ బండ్ల తొలగింపునకు ప్రభుత్వ నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement