కూటమిలో సీట్ల పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో సీట్ల పంచాయితీ!

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

కూటమిలో సీట్ల పంచాయితీ!

నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కొలిక్కిరాని సీట్ల కేటాయింపు కొన్నిచోట్ల ఇండిపెండెంట్‌గా వేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ఆశావహులు

సాక్షి, విజయవాడ: కూటమిలో ‘స్థానిక’ సీట్ల పంచాయితీ జరుగుతోంది. కూటమిలో పార్టీలకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక సంకటంగా మారింది. ఉమ్మడి కృష్ణాలో విజయవాడ కార్పొరేషన్‌, పెడన, తిరువూరు మున్సిపాలిటీలు జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరో వైపు జనసేన కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాలను అధికంగా అడగటం తమ్ముళ్లకు మింగుడుపడడంలేదు. ఎక్కడైనా.. సీటు ఖరారు కాకపోతే స్వతంత్రులుగా బరిలో దిగేందుకు కూడా కొందరు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆశావహుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన.. విజయవాడ మేయర్‌ స్థానంతో పాటు 30 కార్పొరేటర్‌ స్థానాలు, బీజేపీ సైతం 20 కార్పొరేటర్‌ స్థానాలను ఆశిస్తుండటంతో టీడీపీ ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ మేయర్‌ స్థానం కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆశావహులు జనసేన తీరును చూసి ఫైర్‌ అవుతున్నారు. మరోవైపు సమయం తక్కువ ఉండడంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది.

కొలిక్కిరాని చర్చలు..

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ బాలశౌరి మధ్య గ్యాప్‌ ఉండడంతో సీట్ల పంపిణీ కొలిక్కిరాలేదని తెలుస్తోంది. శుక్రవారం ఎంపీ బాలశౌరి మచిలీపట్నంలోని తన కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ కుమారుడు వెంకట్రావు, ఇతర టీడీపీ, జనసేన నేతలతో చర్చలు జరిపారు. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై క్లారిటీ రాలేదని సమాచారం. మచిలీపట్నం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా జనసేన 20 స్థానాలు, బీజేపీ 10 అడుగుతున్నట్లు సమాచారం. పెడన మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం జనసేనకు కేటాయించగా 28 వార్డులకు జనసేన 10, బీజేపీ 6 స్థానాలు కావాలని పట్టుబట్టాయి. నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ టీడీపీకి కేటాయించగా 32 వార్డులకు జనసేన 10, బీజేపీ 10 కావాలని పట్టుబడుతున్నాయి.

తలలు పటుకుంటున్నారు

జగ్గయ్యపేట మున్సిపాలిటీ చైర్మన్‌ టీడీపీ తరఫున నరేంద్రుల వినీత ఖరారు అయ్యారు. ఇక్కడ కూడా 36 వార్డులు ఉండగా జనసేన 10 ఆశిస్తోంది. తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని జనసేనకు ఇవ్వగా.. ఇక్కడ 28 వార్డులు ఉండగా.. జనసేన 15, బీజేపీ 2 స్థానాలు అడుగుతున్నారు. కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి టీడీపీ పోటీ చేయనుండగా 40 వార్డులకు గానూ జనసేన 12, బీజేపీ 5 స్థానాలు అడుగుతోంది.

ఎక్కడా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో మూడు పార్టీల నేతలు తలలు పటుకుంటున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్లగా ఇక్కడ టీడీపీ నుంచి చాలామంది ఆశావహులు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం కోసం పోటీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement