దుర్గమ్మకు బంగారు హారం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు బంగారు హారం

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

దుర్గమ్మకు బంగారు హారం ఐసెట్‌ స్పెషల్‌ కేటగిరీ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రచార రథాలు సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.1.20 లక్షల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సత్యనారాయణపురానికి చెందిన ఉపద్రష్ట శ్రీనివాస్‌ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, డీఈఓ కిషోర్‌కుమార్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఐసెట్‌లో ర్యాంకులు పొందిన స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో సోమవారం మొదలైంది. ఎన్‌సీసీ–22, దివ్యాంగులు–20, సీఏపీ–11, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌–5, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌–1 చొప్పున మొత్తం 59 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, సీఏపీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌–10001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్‌ కేటగిరీలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వివరించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు ఈ నెల రెండో తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి సంస్కృతిని సమూలంగా నిర్మూలించడంతో పాటు బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ల భయాలను తొలగించి ఎన్టీఆర్‌ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చడమే ధ్యేయమని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లాలో సైబర్‌ నేరాల నియంత్రణ, గంజాయి సమూల నిర్మూలనకు తీసుకొచ్చిన మూడు ప్రత్యేక ప్రచార రథాలు, ప్రచార గుర్రాలను తన కార్యాలయం వద్ద ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు, ఈగల్‌ చాలెంజ్‌లపై వినూత్నరీతిలో అవగాహన కోసం డిజిటల్‌ స్క్రీన్లు కలిగిన మూడు ప్రచార రథాలు వారం రోజులు నగర వ్యాప్తంగా తిరుగుతాయన్నారు. గుట్టలు, కొండ ప్రాంతాల్లో అవగాహన కోసం గుర్రాలను, మెక్‌ అనౌన్స్‌ మెంట్‌ సౌకర్యం ఉన్న అత్యాధునిక మాట్రిస్‌ 4టీ డ్రోన్ల ద్వారా విస్తృత ప్రచారంచేస్తామ న్నారు. గంజాయి విక్రేతల సమాచారమందిస్తే రూ.5 వేలు, వినియోగదారుల సమాచారం తెలిపితే రూ.1500 బహుమతిగా ఇస్తామన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయదారులపై తీవ్ర చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 32 మందిపై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. 15 వేల మందికి డ్రగ్‌ టెస్టులు నిర్వహించి, 1,287 మంది వినియోగదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్‌ పటేల్‌, డాక్టర్‌ కె.తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, కె.కృష్ణ ప్రసన్న, జి.రామకృష్ణ, ఏసీపీ దామోదర్‌, ఇన్‌స్పెక్టర్‌ గుణరాం, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డ: ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్‌ జూనియర్‌ సాప్ట్‌బాల్‌ జట్ల ఎంపిక సోమవారం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. వీరంతా సెప్టెంబర్‌ 10, 11, 12 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి గమిడి సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement