ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్ నుంచి మహామండపానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్ పనులను వేగంగా పూర్తి చేసి దసరాకు అందుబాటులోకి తీసుకురావాలని దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం కన్నబాబు, రామచంద్రమోహన్ పరిశీలించారు. కనకదుర్గనగర్, గోశాల, మహామండపం వద్ద వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను తనిఖీచేశారు. తొలుత ప్రతిపాదించిన విధంగా ఆలయ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ చేయగా, వాటి ప్రకారం పనులు జరిగితే తలెత్తే ఇబ్బందులను చర్చించారు. ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్‌ను మహామండపానికి, నూతన అన్నదాన భవనానికి అనుసంధానంగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు చైన్నెకి చెందిన ప్లానర్లతో ఉన్నతాధికా రులు చర్చలు జరిపారు. మహామండపం క్యూ లైన్లలో అధికారులు స్వయంగా నడిచి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. తొలుత రామచంద్రమోహన్ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, దుర్గగుడి ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఎఈఈలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


