● గుడివాడలో రైతుల ఆందోళన ● నాగాయలంకలో ఎండిపోతున్న నారుమళ్లు
నాగాయలంక/గుడివాడరూరల్: అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో రైతన్న సాగునీటి కష్టం ఎదురవుతోంది. నాగాయలంక మండలంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోతుంటే రైతన్నలు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. సాగునీరు అందించి ఆదుకోండి మహాప్రభో అని పాలకులను, అధికారులను వేడుకుంటున్నారు. సీజన్ మొదట్లో కూటమి సర్కార్ నీళ్లు ఇస్తున్నామంటూ ఆశ చూపి చేతులెత్తేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పర్యవసానంగా నాగాయలంక మండలంలో ఈ ఏడాది వ్యవసాయం చతికిలపడింది. సుమారు 60 శాతంపైగా పొలాల్లో పనులు మొదలుకాలేదు. ఆయిల్ ఇంజిన్‌లతో నీటి చేదుకుని వరి నారుమళ్లు వేసుకున్నా ప్రభుత్వం సాగునీరు అందించకపోవడంతో నారుమళ్లు ఎర్రగా మారి ఎండిపోతున్నాయి. మండలంలోని బర్రంకుల, కమ్మనమోలు, సంగమేశ్వరం, నాలి తదితర తీరప్రాంత పొలాలు బీడుగా మారిపోయాయి. భావదేవరపల్లి రెవెన్యూ పరిధిలోని చోడవరం పర్ర తదితర చోట్ల మొదట్లో వెదజల్లిన వరి పొలాలకు సాగునీరు అందక పైరు ఎండిపోతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీరు అందక పెరిగిన నారుతో నాట్లు వేసే పరిస్థితి లేక రైతులు ఏం చేయాలి సారూ ఈ ఏడాది? అంటూ తీవ్ర కలవరంతో కనబడిన వారందరిని అడుగుతున్నారు. కాల్వలకు పంపిస్తున్న కొద్దిపాటి సాగునీటిని పలుచోట్ల చేపల చెరువులకు కొల్ల గొట్టుకుపోతున్నా ఇరిగేషన్ శాఖ నియంత్రణ కొరవడింది.
గుడివాడలో..
సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని మండలంలోని ఆరు గ్రామాల రైతులు కంటతడి పెట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ ఇరిగేషన్ కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని ఆరు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరు అందక 15వేల ఎకరాలపైగా పంట ఎండిపోతుందని, సంబంధిత ఇరిగేషన్ అధికారులు మాత్రం సాగునీరు అందించడంలో తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు సాగునీరు ఇవ్వడం లేదు కానీ డ్రైనేజీ అధికారులు మాత్రం చేపల చెరువులకు నీరు ఎలా అందిస్తున్నారని ఇరిగేషన్ డీఈ పి.సూర్యభరత్‌ను రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గుడివాడ మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ఆందోళన బాటపట్టామన్నారు. ఆయా గ్రామాల్లో 15వేల ఎకరాలు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు విడుదల చేయకపోతే తామంత ఆందోళనలు, నిరసన చేస్తామని ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో రైతులు పాల్గొన్నారు.


