పెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్న ఫాతిమా మాత మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నవదిన ప్రార్థనలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గన్నవరం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ పసల థామస్ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జపమాల, దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ.. మరియతల్లి విధేయతపై వ్యాక్యోపదేశం చేశారు. ఆమె ఎంతో వినయంతో విధేయతతో దేవుని ప్రణాళిక, రక్షణ చరిత్రకు నాంది పలికారని వివరించారు. రెక్టార్ రెవరెండ్ ఫాదర్ జ్వాన్నేస్ నీలూరి మాట్లాడుతూ.. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ ఆరో తేదీ వరకు రోజూ సాయంత్రం నవదిన ప్రార్థనలు, జపమాల, దివ్యబలిపూజ జరుగుతా యని తెలిపారు. ఏడో తేదీన ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఆశీర్వాదం, ఫాతిమా మాత స్వరూప ప్రదక్షిణ ఊరేగింపు, ఎనిమిదో తేదీన ఎనికేపాడు మేరిమాత ప్రోవిన్సుకు చెందిన రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ కాసు నేతృత్వంలో సమష్టి దివ్యబలిపూజ జరుగుతాయని వివరించారు. క్రీస్తు విశ్వాసులు పాల్గొని ఈ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుండా శ్రీనివాసరావు (49), మల్లేశ్వరి దంపతులు భవానీపురం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అతను గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్‌లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని విశ్వనాథ శర్మ, మల్లేశ్వరితో కలిసి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఉన్న మామిడిచెట్టు కాయలు కోస్తున్నాడు. కొద్దిసేపటికి మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లిపోయింది. శ్రీనివాసరావు తన చేతిలో ఉన్న స్టీల్ రాడ్‌తో చెట్టుకొమ్మ చివరి భాగంలో ఉన్న కాయను కోసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఆ స్టీల్ రాడ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతను కదలకపోవడంతో మల్లేశ్వరి, ఇంటి యజమాని విశ్వనాథ శర్మ 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి శ్రీనివాసరావు చనిపోయాడని నిర్ధారించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట
పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14న పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని అర్చకులు అధికారులకు చెప్పారు. ఆ వారం రోజులు విధులు నిర్వహించిన అర్చకులకు 19న షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 26న ఐదుగుర్ని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు మాయమై దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చెత్త వేసే ప్రదేశంలో వెతడం ప్రారంభించారు. ఇన్ని రోజుల తరువాత ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


