● రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత
● కృష్ణాజిల్లా కంకిపాడు, ఆత్కూరు
పోలీసుస్టేషన్ భవనాల ప్రారంభం
కంకిపాడు/గన్నవరం: శాంతి భద్రతల పరిరక్షణకు, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో రూ.2.75 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, ఉంగుటూరు మండలం ఆత్కూరులో రూ.1.40 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను, ఆత్కూరులో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఐపీ ఆధారిత కెమెరాలను సోమవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో హోం మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం..
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పటిష్టంగా పోలీసింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణంలో కీలక పాత్ర వహించిన కోఆర్డినేటర్ తుమ్మలపల్లి హరికృష్ణను హోం మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐజీపీ అశోక్‌కుమార్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్‌పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


