ఆరోగ్యంతో సెల్‌గాటం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంతో సెల్‌గాటం

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

● విజయవాడ రాణీగారితోటకు చెందిన 25 ఏళ్ల నరేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఒక రోజు సీరియస్‌గా ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ ఓడిపోతానన్న భయంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లిపోయాయి. ఆస్పత్రిలో చేర్చగా రెండు రోజుల చికిత్స అనంతరం మృత్యువాత పడ్డాడు. ● సెల్‌ ఫోనును ఎక్కువగా చూసే వారిలో బ్లూలైట్‌ కంటిమీద పడి బ్రెయిన్‌లోని మెలటోనిన్‌ దెబ్బతింటోంది. దీంతో స్లీప్‌ సైకిల్‌ అదుపుతప్పుతోంది. ఫలితంగా నిద్రపట్టకపోవడం, మధ్య రాత్రిలో మెలకువ రావడం జరుగుతోంది. ఇలాంటి వారిలో కోపం, చిరాకు, అసహనం పెరిగిపోతాయి. ● విద్యార్థులు అయితే చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపిక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో చదువు దెబ్బతింటోంది. ● ఉద్యోగులు విధులపై దృష్టిపెట్టలేక పోవడం, కిందిస్థాయి సిబ్బందితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, ప్రవర్తనలో విపరీత మార్పు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కోపం విపరీతంగా పెరిగిపోతోంది. ● ఆకలి లేకపోవడం, తినకపోవడం వల్ల పోషకాహారం లోపించి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. ● రోజులో ఎక్కువ గంటలు ఫోన్‌ చూసే, మాట్లాడే వారిపై రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. మెదడుపై రేడియేషన్‌ ప్రభావం వల్ల కొందరిలో బ్రెయిన్‌ ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉంది. ● సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో వీర్యకణాల ఉత్పత్తి తగ్గడం, లైంగిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సెల్‌ ఫోన్‌ను ఎక్కువ సేపు చూసినా, మాట్లాడినా అనారోగ్యమే శారీరక, మానసిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్న వైద్యులు

ప్రభుత్వ ఉద్యోగం చేసే మహేష్‌ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఫోన్‌ చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎదైనా కాల్‌ వస్తే కంగారు పడుతుంటాడు. ఒక రోజు తీవ్రమైన తలనొప్పితో కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్తపోటు 160/90 ఉంది. అతని వయస్సు 35 సంవత్సరాలే. ఫోన్‌ చూసే సమయంలో ఒత్తిడి వల్ల చిన్నవయసులోనే రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తేల్చారు. ఇలా వీరిద్దరే కాదు నిత్యం వేలాది మంది ఫోన్‌లు చూస్తూ, మాట్లాడుతూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారిలో బీపీ అదుపుతప్పుతోంది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గడిచిన సమయంలో ఒక్క సెకను కూడా తిరిగిరాదు. నేడు విద్యార్థులు, యువత, పెద్దలు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అందరూ ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇలా తమకు తెలియకుండానే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతే కాదు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తగ్గుతున్న అన్యోన్యత

స్మార్ట్‌ ఫోన్‌ల దెబ్బకి మనుషుల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉండి స్మార్ట్‌ ఫోన్లు, టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు, భార్యాభర్తలు ఇద్దరూ చేరోవైపు కూర్చుని ఖాళీ దొరికితే చాలు ఫోన్‌ తీసుకుని రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య అన్యోన్యత దెబ్బతింటోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మానసిక సమస్యలు ఇలా..

అనారోగ్య సమస్యలు ఇలా.. ..

Advertisement
 
Advertisement
Advertisement