ఆల్‌ ఇండియా జూనియర్‌ లాన్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌–2026 ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇండియా జూనియర్‌ లాన్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌–2026 ప్రారంభం

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆల్‌ ఇండియా జూనియర్‌ (అండర్‌–16, బాలురు, బాలికల) లాన్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీలను సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కామినేని పట్టాభిరామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా మెరుగవుతాయని అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో గమనించి తల్లిదండ్రులు ఆ క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తే వారు రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వై.బాబూరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌, ఎన్టీఆర్‌ జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అసోసియేషన్‌ కార్యదర్శి ఈ.లలిత్‌కుమార్‌, కోశాధికారి శ్రీనివాసరావుతో పాటుగా సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆకివీడులో మత కల్లోలాలకు కుట్ర

నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్‌ మస్క్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో మతకల్లోలాలకు కుట్ర జరుగుతోందని నేషనల్‌ క్రిస్టియన్‌ బోర్డ్‌ జాతీయ అధ్యక్షుడు జాన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్‌ లోని ఒక హోటల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకివీడులో గత మూడు నెలలుగా అశాంతి నెలకొందన్నారు. డెప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు వైఖరి వల్ల హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని జాన్‌ మస్క్‌ మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించకుండా, ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు పాల్పడటం శోచనీయమన్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకే రఘురామకృష్ణంరాజు రాష్ట్రాన్ని మణిపూర్‌ తరహాలో మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్‌ చేశారు.సమావేశంలో ఏపీ క్రిస్టియన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధ్యక్షుడు పాస్టర్‌ ఎండీ ఇస్మాయిల్‌, జి.రాజేష్‌ ఖన్నా, పీతల రాజు, యోసేబు, విజయ శేఖర్‌, ప్రకాష్‌, విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement