పేకాట రాయుళ్లకు ‘అధికారిక’ అడ్డాగా పామర్రు నియోజకవర్గం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలవారీ ముడుపులు మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు పర్మినెంట్‌గా క్లబ్ ఏర్పాటు చేసేందుకు యత్నం నిండా మునిగిపోతున్న జూదగాళ్లు పెనమలూరు నియోజకవర్గంలోనూ అదే తంతు
పామర్రులో జడలు విప్పిన జూదం
పెనమలూరు కేంద్రంగా..
సాక్షి టాస్క్‌ఫోర్స్: పామర్రులో పేకాట మూడు ముక్కలు.. ఆరు పేకలు అన్న చందంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలోనే ఈ నియోజకవర్గం పేకాటకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట డెన్‌లు ఏర్పాటు చేసి జోరుగా జూదాన్ని సాగిస్తున్నారు. ఆట మోజులో పడి అనేకమంది పేకాట రాయుళ్లు తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పుల పాలై పలు కుంటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇదే అదునుగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తూ, నిర్వాహకుల నుంచి రోజువారీ, నెలవారీ మామూళ్లు పెట్టి భారీగా దండుకొంటున్నారు. పేకాటను అరికట్టాల్సిన పోలీసులు సైతం సందట్లో సడేమియా అన్నట్లుగా.. పేకాట శిబిరాలపై దాడి మాట దేవుడెరుగు, ఆ శిబిరాలకు వీరే రక్షణ కవచంలా వ్యవహరిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. పమిడిముక్కల, పామర్రు ప్రాంతాల్లోని పోలీసు బాస్‌లు, సైతం అక్కడ జరిగే ఆటను బట్టి పర్సంటేజీ పెట్టుకోవడంతో పాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రోజువారీ, నెలవారీ మామూళ్లు వసూలు చేసే బాధ్యతను తీసుకున్నట్లు ఈ ప్రాంతంలో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా స్థానిక పోలీసులే, నియోజకవర్గ ప్రజాప్రతినిధితో కుమ్మక్కై జోరుగా పేకాటను నడుపుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంత ధీమాగా ఆట నడుపుతున్నారంటే, పై స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ తంతు నడుస్తుందా అనే భావన సైతం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇక్కడ జరుగుతున్న పేకాటకు సంబంధించి నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి స్పెషల్ పార్టీలతో ఆకస్మిక దాడులు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
పేకాట జరిగే ప్రాంతాలు ఇవే..
ప్రధానంగా పామర్రు నియోజకవర్గం, మొవ్వ మండలంలోని క్రోసూరు, కాజ, పామర్రు మండ లంలో పామర్రు, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు, పెదపారుపూడి మండలంలోని మహేశ్వరపురం, పమిడిముక్కల మండలంలోని హనుమంతపురం, పమిడిముక్కల, తోట్లవల్లూరులోని లంక గ్రామాల్లో యథేచ్ఛగా పేకాట సాగుతోంది. దీంతో పాటు పామర్రులో చిత్తుల ఆట నిర్వహిస్తున్నారు. ఈ ఆటకు సైతం రోజువారీ మామూలు రూ.10 వేలుగా పోలీసులు నిర్ణయించినట్లు జోరుగా చర్చ సాగుతోంది.
పర్మినెంట్ పేకాట క్లబ్‌కు యత్నం..
పెదపారుపూడి మండలం దోసపాడులో పర్మినెంట్ పేకాట క్లబ్ ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. విషయం బయటకు పొక్కడంతో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ వెంటనే స్పందించి పామర్రులో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని, ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. దీంతో అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. తాత్కాలికంగా క్లబ్ ప్రతిపాదన ఆగిపోయింది.
పామర్రు తరువాత పెనమలూరు నియోజకవర్గంలోనే పేకాట జోరుగా సాగుతోంది. ఇక్కడ కూడా నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అంతా సాగుతోందని తెలుస్తోంది. పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటంతో వారు నోరు మెదపడం లేదు. ప్రధానంగా పోరంకి, పద్మావతి కాలనీ, వణుకూరు, పెనమలూరు, కంకిపాడులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో, ఉయ్యూరులోని పలు ప్రాంతాల్లో పేకాట సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోరంకి–నిడమానూరు రోడ్డులో గన్నవరం నియోజకవర్గం వారు వచ్చి ఆడుకొనేలా అధికార పార్టీనేతలే ఏర్పాట్లు చేశారు. గతంలో పోరంకి సమీపంలో పోలీసుల దాడుల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరుడు పట్టుపడిన విషయం విదితమే. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, పోలీసులకు ముడుపులు అందుతుండటంతో, ఈ పేకాట డెన్‌ల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


