జిల్లాలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, కాంపోజిట్ తెలుగు)తో పాటు ఓపెన్ స్కూల్ (ఏపీఓఎస్‌ఎస్) పబ్లిక్ పరీక్షలు (తెలుగు/ఉర్దూ) జిల్లాలో సోమవారం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి పరిశీలించగా, మరో 12 పరీక్ష కేంద్రాలను సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా అబ్జర్వర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ సందర్శించి పరీక్షల నిర్వహణ విధానంపై సంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదనంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, రెండు ఏసీజీఈలు మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలు..
జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాల్లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 21,438 మంది విద్యార్థుల్లో 21,173 మంది హాజరై, 265 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 98.76గా నమోదైంది.
రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు..
రెగ్యులర్ విద్యార్థుల్లో 21,272 మంది నమోదు కాగా, 21,080 మంది హాజరై 192 మంది గైర్హాజరయ్యారు. హాజరు 99.10 శాతంగా నమోదు కాగా ప్రైవేట్ (వన్స్ ఫెయిల్) విద్యార్థుల్లో 166 మంది నమోదు కాగా, 93 మంది హాజరై 73 మంది గైర్హాజరయ్యారు. హాజరు 56.02 శాతంగా ఉంది.
ఓపెన్ స్కూల్..
ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లాలోని ఎనిమిది పరీక్ష కేంద్రాలలో మొత్తం 591 మంది విద్యార్థులు నమోదు కాగా, 428 మంది హాజరయ్యారు. 163 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 72.42గా నమోదైంది.
పరీక్ష కేంద్రాల పరిశీలన..
జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు నగరంలోని సీపీఎం హైస్కూల్ చిలకలపూడి, నిర్మల హై స్కూల్, హైని హై స్కూల్, బాలాజీ విద్యాలయం, బాలభాను హై స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే నిర్మల హై స్కూల్, బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలను కూడా సందర్శించారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.


