ఆస్కార్‌ నీరాజనం | - | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ నీరాజనం

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

ఆస్కార్‌ నీరాజనం విలక్షణ తెలుగు నటుడికి.. అంతర్జాతీయ వేదికపై వినమ్ర నివాళి

అరుదైన గౌరవం..

నటనా కోటకు

కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు.

కంకిపాడు నుంచే అన్నీ..

గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్‌ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్‌ నడిపేవారు. వైద్యుడిగా అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్‌రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు.

కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్‌ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది.

– గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement