బరి తెగించి మద్యం అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

బరి తెగించి మద్యం అమ్మకాలు

Mar 16 2026 8:35 AM | Updated on Mar 16 2026 8:35 AM

బరి తెగించి మద్యం అమ్మకాలు

ఇంజినీరింగ్‌ కళాశాలకు అతి సమీపంలోనే బార్‌ ఏర్పాటు

కల్తీ మద్యం అమ్ముతున్నా మంత్రికి పట్టడం లేదు

మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం

చిలకలపూడి(మచిలీపట్నం): కంచే చేను మేసిన చందంగా ఎకై ్సజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బరితెగించి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దానికి మంత్రి వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మైక్‌లలో మాత్రం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్న మంత్రి.. కాసుల కక్కుర్తితో మద్యాన్ని విచ్చలవిడి చేస్తున్నారన్నారు. మంగినపూడిబీచ్‌ రోడ్డులో బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా.. షామియానాలో బార్‌ను ఏర్పాటు చేయటం అధికార పార్టీ నాయకులకే చెల్లిందన్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఆరు బయట, స్టేట్‌ హైవే వద్ద ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారన్నారు. ప్రజలకు కనపడకుండా ఏర్పాటు చేయాల్సినప్పటికీ డమ్మీగా ఈఎస్‌ గంగాధరరావును పెట్టుకుని ఏఈఎస్‌ భార్గవ్‌ను ఏజెంట్‌గా పెట్టుకుని అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి అడ్డగోలుగా దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. మంత్రి కనుసన్నల్లో అమ్మకాలు జరుగుతున్నా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఆయనకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదన్నారు. ఈ విషయాలపై తాను సమాచార హక్కు చట్టం కింద నాలుగు నెలల క్రితం కోరినప్పటికీ మామూళ్ల మత్తులో నిద్రపోతున్న ఎకై ్సజ్‌ అధికారులు ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు.

కలెక్టర్‌, ఎస్పీ ఏం చేస్తున్నారు?

ఈ విధంగా మద్యం మాఫియా చెలరేగుతుంటే కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఏం చేస్తున్నారు.. కనీసం పట్టించుకోవాలి కదా అని పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రి ఏం పాపం చేసినా చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. కేవలం జెండాలు కట్టడానికే పోలీస్‌ బందోబస్తు పనిచేస్తుందా అని ఆయన అన్నా రు. ఎకై ్సజ్‌ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ప్రొహిబిషనరీ నిబంధనలను గాలికొదిలేసి ఏఈఎస్‌ భార్గవ్‌.. మంత్రి కొల్లుకు చెంచాగిరీ చేస్తున్నారని విమర్శించారు.

బార్‌ను సీజ్‌ చేయండి..

అధికారులు మత్తు వీడి ధర్మానికి ఉద్యోగం చేయాలని పేర్ని హితవు పలికారు. వెంటనే బార్‌ను సీజ్‌ చేయాలని, ఏఈఎస్‌ భార్గవ్‌ను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో, ఏ బ్రాండ్‌, ఎంత విలువైనది, ఎన్ని సీసాలు అమ్మారో బహిరంగంగా వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు గాజుల భగవాన్‌, బూరగ రామారావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement