విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు దుర్మరణం

Mar 15 2026 4:52 AM | Updated on Mar 15 2026 4:52 AM

చల్లపలి: జీవనోపాధి కోసం పనికి వెళ్లిన యువకుడు కరెంటు షాక్‌ తగిలి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రామానగరానికి చెందిన అల్లంశెట్టి నాగేశ్వరరావుకు కుమారుడు సురేష్‌(25), కుమార్తె ఉన్నారు. శనివారం పాగోలు పంచాయతీ శివారు శ్రీనగర్‌ కాలనీలో తాపీ పని చేసేందుకు తోటి పనివారితో కలిసి వెళ్లాడు. పొద్దుపోయాక పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో పరంజాకు నిలిపి ఉన్న ఇనుప రాడ్డు జారి పక్కకు ఒరిగిపోతుండగా సురేష్‌ పట్టుకునే ప్రయత్నం చేశాడు. రాడ్డు పక్కనున్న కరెంటు తీగలకు తగిలి సురేష్‌కు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి పనివారు వెంటనే సురేష్‌ను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌ఐ దంపనపూడి దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సురేష్‌ దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు ఒక్కసారిగా విగత జీవుడిగా మారడంతో సురేష్‌ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా హృదయవిదారక పరిస్థితి నెలకొంది.

రేషన్‌ బియ్యం పట్టివేత

పెనమలూరు: కానూరులో రేషన్‌ బియ్యాన్ని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో కానూరు ఆటోనగర్‌లో రోడ్డు పక్కన రేషన్‌ బియ్యంతో ఉన్న లారీ నిలిపి ఉండటంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే లారీ డ్రైవర్‌ పారిపోయాడు. పోలీసులు లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement