మొక్కుబడిగా ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా ప్రజాభిప్రాయ సేకరణ

Mar 13 2026 9:00 AM | Updated on Mar 13 2026 9:00 AM

తోట్లవల్లూరు: ఇసుక క్వారీల అనుమతుల మంజూరు విషయమై సాగిన ప్రజాభిప్రాయ సేకరణ మొక్కుబడిగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. రొయ్యూరు, నార్తువల్లూరు ఇసుక క్వారీల విస్తీర్ణం పెంపుదల కోసం కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యాన మండలంలోని రొయ్యూరు, తోట్లవల్లూరు గ్రామాలలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు జరిగాయి. సదస్సుల ఉద్దేశాన్ని ఈఈ శ్రీనివాస్‌ వివరించారు. రొయ్యూరు, నార్తువల్లూరు రీచ్‌లలో సుమారు 9 లక్షల టన్నులు ఇసుక తవ్వకాలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇసుక తవ్వకాలు వలన పర్యావరణ పరంగా తలెత్తే ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయా సదస్సులకు ప్రజల నుంచి స్పందన కొరవడింది. ఇసుక తవ్వకాలు, రవాణాకు వ్యతిరేకంగా అర్జీలు ఇచ్చినా అధికారులు పెద్దగా పట్టించుకోరనే ఉద్దేశం ప్రజల్లో బలంగా నాటుకుపోవటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణ జరుపుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని సామాజిక కార్యకర్త తూమాటి సుధాకర్‌ తోట్లవల్లూరు సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రొయ్యూరులో కృష్ణా కరకట్ట నుంచి కృష్ణానది వరకు ఉన్న జాలురోడ్డు అభివృద్దికి చర్యలు తీసుకోవాలని బీసీ జనగణన సాధన సమితి నాయకుడు లుక్కా వెంకట శ్రీనివాసరావు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి, మైనింగ్‌ ఏడీ కొండారెడ్డి, తహసీల్దార్‌ కుసుమకుమారి, వీఆర్‌ఓలు శ్రీను, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement