గన్నవరంరూరల్: మండలంలోని సూరంపల్లి రెవెన్యూ పరిధిలోని మాదలవారిగూడెం గ్రామంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, రాష్ట్ర సూక్ష్మ నీటి సేద్యం పథకం అదనపు సంచాలకులు ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యాన అదనపు సంచాలకులు సీబీ హరినాథరెడ్డిలతో కలసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రి సమయంలో కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అధికారులు నాయుడు సత్యనారాయణ, పుల్లారెడ్డి, పోతురాజు, పద్మావతి, అరుణ, మోహన్‌బాబు, యుగంధర్, జ్యోతి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మూడో విడతలో జిల్లాలోని రైతులకు రూ. 67.69 కోట్లు లబ్ధిచేకూరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడో విడతలో 1,18,629 మంది లబ్ధిదారులకు రూ.4 వేలు చొప్పున రూ. 47.45 కోట్లు లబ్ధి జరుగుతుందని.. అదేవిధంగా పీఎం కిసాన్ కింద 1,01,200 మంది లబ్ధిదారులకు రూ. 2 వేలు చొప్పున రూ. 20.24 కోట్లు జమవుతుందన్నారు. శుక్రవారం రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. నిధులను ఖాతాల్లో జమచేసే కార్యక్రమాలు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ జరగనున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.


