రాష్ట్ర లెప్రసీ విభాగం జేడీ డాక్టర్ దేవసాగర్
మచిలీపట్నంఅర్బన్: కుష్ఠు వ్యాధి ఒక సంక్రమణ వ్యాధి కాగా, ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని రాష్ట్ర లెప్రసి విభాగం (ఎస్.ఎల్.డి) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ తెలిపారు. సోమ వారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జాతీయ లెప్రసీ నిర్మూలనలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్‌పై డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ వ్యాధని చెప్పారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సమ యానికి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లా లెప్రసి వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యా ధి నివారణ, గుర్తింపు, చికిత్సలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని చెప్పారు. జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ లెప్రసి వ్యాధి ఉన్నవారిని సమాజం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందించి చికిత్స కల్పిస్తోందన్నారు. వ్యాధిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ, మెడికల్ అధికారులు, ఫార్మసీ అధికారులు, పిహెచ్‌సి నోడల్ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జాయింట్ కలెక్టర్ నవీన్
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ టీకా కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ టీకా గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాలు, ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ ఎం.ఎన్.రాణి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని పీపీ యూనిట్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించేందుకు 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు.


