చట్ట పరిధిలో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

చట్ట పరిధిలో సమస్యల పరిష్కారం

Mar 11 2026 8:57 AM | Updated on Mar 11 2026 8:57 AM

కోనేరుసెంటర్‌: మీకోసంలో అందిన ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించటం జరుగుతుందని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరించటం జరుగుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పై స్థాయి అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుదారులతో మర్యాదమాట్లాడటంతో పాటు వారి సమస్యలను సామరస్యంగా ఆలకించి ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే నమ్మకాన్ని బాధితుల్లో కలిగించాలన్నారు. అప్పుడే పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులతో అమర్యాదగా మాట్లాడినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 35 అర్జీలు అందుకున్నట్లు తెలిపారు.

● హనుమాన్‌ జంక్షన్‌ నుంచి హరి అనే వ్యక్తి వచ్చి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 3 లక్షలు అప్పుగా ఇవ్వడం జరిగిందని, తీసుకుని రెండేళ్లు గడుస్తున్నప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరాడు.

● పామర్రుకు చెందిన వీరయ్య అనే వృద్ధుడు వచ్చి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తన దగ్గర బంధువులు ఫోర్జరీ చేసి వారి పేర రాయించుకోవాలని చూస్తున్నారని అడిగినందుకు తపై దాడి చేస్తూ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.

● తోట్లవల్లూరు నుంచి లత అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి రెండేళ్లయిందని చెప్పింది. అయితే పిల్లలు పుట్టలేదనే కారణంతో భర్త అత్తింటి వారు బలవంతంగా విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. తనకు అన్యాయం జరగకుండా చూడాలని కోరింది. పై అర్జీలపై స్పందించిన ఎస్పీ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement