కొండపల్లి(ఇబ్రహీంపట్నం): త్వరలో నిర్వహించనున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులకు సోమవారం కొండపల్లి డీఏవీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవ్వాలని, పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులో తాగునీరు, ఫ్యాన్‌లు, టాయిలెట్, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు జరగకుండా పేపర్ కోడ్ ఆధారంగా ఏరోజు ప్రశ్నపత్రం ఆ రోజే అందేలా చూడాలన్నారు. సమావేశంలో వివిధ డివిజన్‌ల డీవైఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.


