చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సానుకూలంగా, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రభుత్వశాఖలకు సంబంధించిన నివేదికలను వెంటనే అందజేయాలన్నారు. 24 గంటల్లోగా పరిష్కరించాల్సిన అర్జీలు ఇంకా 37 పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మీ కోసంలో అధికారులు ప్రజల నుంచి 126 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
మొవ్వ మండలం యద్దనపూడి గ్రామంలో సర్వే నంబరు 180లో 145.2 చదరపు గజాల స్థలంలో 1982 నుంచి పాలసేకరణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్షిణం వైపు ఉన్న సరిహద్దుదారురాలైన పామర్తి సాయిరాణి 2022లో మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామానికి చెందిన పామర్తి వీరజనార్దనరావు ఆరోపించారు. ఈ స్థలం తమదేనని పాలసేకరణ కేంద్రానికి నోటీసు పంపామని చెప్పారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు.


