కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలం
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
మోపిదేవి: కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబుతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోందని, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకొన్నారని విమర్శించారు.
తమ వారికి భూములు కట్టబెడుతున్నారు..
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ కల్తీ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని చెప్పిందన్నారు. గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలన్న అంబటి రాంబాబుపై దాడి చేశారని తెలిపారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ నలుకుర్తి రమేష్, మండల బీసీ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరావు, పంచాయతీరాజ్ నియోజకవర్గ అధ్యక్షుడు బండారు సూరిబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


