కనులపండువగా కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి పూజను నిర్వహించగా, ఆలయ చైర్మన్, ఈవోలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కల్యాణోత్సవాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. తొలుత స్వామి వారికి త్రికాల అభిషేకాలు, మహాన్యాసం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు..
మల్లేశ్వర స్వామి వారికి నిర్వహించిన విశేష అభిషేకాలు, అర్చనలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు పాల్గొన్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కలెక్టర్ లక్ష్మీశను దేవస్థాన ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం, నందీశ్వరుల ప్రతిమల వద్ద కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.
ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. పూలతో సిద్ధం చేసిన శివలింగం, నంది, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాలింగం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆలయ అర్చకులు సూర్యభగవానుడి విగ్రహానికి విశేష పూజలు చేశారు. రాజగోపురం వద్ద లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి పూజా కార్యక్రమాలు, అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు.
కనులపండువగా కల్యాణోత్సవం
కనులపండువగా కల్యాణోత్సవం


